Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

Advertiesment
murder

ఠాగూర్

, మంగళవారం, 7 జనవరి 2025 (19:58 IST)
ఓ అవినీతి కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది. తలను 15 చోట్ల కొట్టి, కాలేయాన్ని నాలుగు ముక్కలుగా చేసి, గుండెను బయటకు తీసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. పక్కటెముకలు పూర్తిగా విరిగిపోయాయి. జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం చేసిన వైద్యులు.. తమ కెరీర్‌లో ఇంత భయానక హత్యను చూడలేదని పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సురేశ్ చంద్రకర్‌ను ప్రత్యేక దర్యాప్తు హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా బీజాపూర్‌కు చెందిన ముకేశ్ చంద్రకర్(28) ఓ జాతీయ ఛానలు న్యూస్ కంట్రిబ్యూటర్‌గా పని చేయడంతోపాటు బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవారు. ఈ క్రమంలో గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన ఓ రోడ్డు ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ గత ఏడాది డిసెంబరు 25న కథనాన్ని ప్రసారం చేశారు. 
 
అయితే అదేరోజు నుంచి అతను కనిపించకుండాపోయారు. ఆయన తమ్ముడు యుకేశ్ ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు జనవరి 3న కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్‌కు చెందిన ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ మృతదేహాన్ని గుర్తించారు. ముకేశ్ వెలుగులోకి తెచ్చిన అవినీతి ప్రాజెక్టులో సురేశ్ భాగస్వామిగా ఉండటం, హత్య ఘటన వెలుగులోకి రాగానే పరారీకావడంతో పోలీసులు అతన్నే కీలక నిందితుడిగా భావిస్తున్నారు. 
 
ఈ కేసు దర్యాప్తునకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పోలీసులు అప్పటికే ఇద్దరు నిందితులు రితీష్, దినేశ్ చంద్రకర్‌ను అరెస్టు చేశారు. రితీశ్, మహేంద్రలు జర్నలిస్టు ముకేశ్‌ను భోజనం చేద్దామని గుత్తేదారు సురేశ్‌కు చెందిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వాగ్వాదం చోటుచేసుకోగా వారిద్దరూ ఇనుప రాడ్డుతో కొట్టి తీవ్రంగా హింసించారు. దీంతో ముకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత దినేశ్ అనే వ్యక్తి సహకారంతో మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో వేసి సిమెంటుతో కప్పేశారు. 
 
సురేశ్ ప్రణాళిక మేరకే వారు ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రితీష్, దినేశ్, సురేశ్‌కు ముకేశ్‌కు దూరపు బంధువులు కావడం గమనార్హం. తాజాగా సిట్ అధికారులు సురేశ్ హైదరాబాద్‌లోని తన డ్రైవరు ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతని భార్యనూ అదుపులోకి తీసుకున్నారు. ముకేశ్ హత్య ఘటనను దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?